ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రాష్ట్ర శాసన మండలిని రద్దు చేస్తున్నట్లు చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటోంది. 2020 జనవరిలో శాసనమండలిని రద్దు తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మండలి రద్దు తీర్మానానికి 132 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఒక జనసేన ఎమ్మెల్యే కూడా అనుకూలంగా ఓట్లు వేశారు. అయితే ఈ తీర్మాననంపై టీడీపీ నుండి ఎలాంటి ఓట్లు పడలేదు. శాసనమండలి రద్దు తీర్మానం సమయంలో టీడీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరుకాలేదు. దీంతో ఆ రోజు శాసన మండలి రద్దు తీర్మానాన్ని శాసనసభ స్పీకర్ ఆమోదించారు. ఆ తర్వాత తీర్మానాన్ని కేంద్ర హోంశాఖకు పంపారు. తాజాగా ఈ తీర్మానాన్ని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శాసనమండలి రద్దుకు సంబంధించి మరో తీర్మానాన్ని తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. బిల్లులో మరి కొన్ని మార్పులు చేసి మళ్లీ తీసుకువస్తామని వైసీపీ సర్కార్ తెలిపిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసన సభలో ప్రవేశపెట్టారు. సీఆర్డీఏ, పాలన వికేంద్రీకరణ రద్దు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు నిన్న శాసనసభలో బిల్లును బుగ్గన ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బిల్లును ఆమోదింప చేసేందుకు మండలిలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడారు. వికేంద్రీకరణ రాష్ట్రానికి అవసరమన్నారు. లేకపోతే వేర్పాటువాదం వచ్చే పరిస్థితి ఉందని చెప్పారు. శివరామకృష్ణణ్ కమిటీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చిందన్నారు.