రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా.. ఫలించిన సీఎం కృషి
ప్రస్తుతం దేశ వ్యవసాయ రంగములో యూరియా సరఫరా సంక్షోభం ,ప్రతిష్టంభన ఏర్పడిన ఈ కీలక సమయములో
By Medi Samrat
ప్రస్తుతం దేశ వ్యవసాయ రంగములో యూరియా సరఫరా సంక్షోభం ,ప్రతిష్టంభన ఏర్పడిన ఈ కీలక సమయములో రాష్ట్ర రైతాంగానికి ముఖ్యముగా సన్న ,చిన్న కారు రైతులు ,కౌలు రైతులకు యూరియా విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు స్వయంగా ప్రత్యక్ష కార్యాచరణ లోకి దిగి ,వరుసగా కేంద్ర ప్రభుత్వంతో, ముఖ్యముగా కేంద్ర ఎరువుల రసాయనిక మంత్రి నడ్డాతో జరిపిన చర్చల ద్వారా,రాష్ట్ర రైతుల అవసరాలను వారి దృష్టికి తీసుకెళ్లడం లో చేసిన విశేష కృషి పూర్తి స్థాయిలో సత్ఫలితాలను ఇచ్చి, ప్రస్తుత ఈ కీలక సమయములో 50000 మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయింపు చేసినందుకు రైతుల తరుపున మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్(సి ఐ యల్) ద్వారా కాకినాడ పోర్ట్ నకు 17294 మెట్రిక్ టన్నులు, ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐ పి యల్)మంగళూరు కు 5400 మెట్రిక్ టన్నులు ,నర్మదా కంపెనీ నుండి జైగర్ పోర్ట్ నకు 10800 మెట్రిక్ టన్నులు, నేషనల్ ఫెర్టిలైజర్స్ నుండి విశాఖ కు 15874 మెట్రిక్ టన్నుల యూరియా రాబోవు రెండు రోజుల లోపు రాష్ట్రానికి చేరుతున్నాయని తెలిపారు .
ఈ కేటాయించిన 50000 మెట్రిక్ టన్నుల యూరియా ఆగస్టు నెలకు కేటాయించిన 82151 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపుకు అదనం అని చెప్పారు .41183 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటికే రైతుసేవ కేంద్రాలకు సరఫరా చేయటం జరిగిందని ,మిగిలిన 40968 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు సిద్ధముగా ఉండి,రవాణా లో ఉందని తెలిపారు .
రైతులు ధైర్యముగా ఉండాలని ,ఎటువంటి కొరత లేదని తెలిపారు.శాస్త్రీయంగా ,తక్షణ అవసరాలకు అనుగుణంగా మాత్రమే వ్యవసాయ అధికారుల నుంచి సిఫారసు మేరకు మాత్రమే యూరియా వాడాలని కోరారు . వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు ఐఏఎస్ కు సూచనలను చేస్తూ ఎరువుల వినియోగము పై గ్రామ స్థాయిలో క్షేత్ర సిబ్బంది ఔట్ రీచ్ కార్యక్రమము నిర్వహించాల్సిందిగా తెలియ చేశారు. రాష్ట్రానికి సమృద్ధిగా ఎరువులను కేటాయించడంలో చంద్రబాబు నాయుడుకు మరొకసారి కృతజ్ఞతలు తెలిపారు.