టీటీడీ పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశమైన పరకామణి కేసులో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
By - Knakam Karthik |
టీటీడీ పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశమైన పరకామణి కేసులో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తును వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సీఐడీ, ఏసీబీ సంస్థలను ఆదేశించింది. మంగళవారం ఈ కేసుపై విచారణ సందర్భంగా నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సీఐడీ సమర్పించిన నివేదికలో స్పష్టంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా అవసరమని అభిప్రాయపడింది. చోరీ ఘటన మినహా, దర్యాప్తులో తేలిన ఇతర అంశాలపై సీఐడీ, ఏసీబీ విచారణ కొనసాగించవచ్చని న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది. నిందితులతో చేతులు కలిపిన పోలీసులపై కేవలం శాఖాపరమైన చర్యలు తీసుకుంటే సరిపోదు.. వారి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలి” అని న్యాయమూర్తి సీఐడీ (CID) అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులైన పోలీసు అధికారుల ఆదాయానికి మించి ఆస్తులు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో ఏసీబీ (ACB), సీఐడీ సంయుక్తంగా లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. తప్పు చేసిన వారు ఖాకీ దుస్తుల్లో ఉన్నా ఉపేక్షించేది లేదని కోర్టు స్పష్టం చేసింది.
మరోవైపు, పరకామణిలో చోరీలు పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్యలపై టీటీడీ హైకోర్టుకు సమర్పించిన నివేదికపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలోనే న్యాయస్థానం మెరుగైన, ప్రత్యామ్నాయ విధానాలపై నివేదిక కోరగా.. టీటీడీ మంగళవారం సమర్పించిన నివేదికలో పస లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. కౌంటింగ్ ఏర్పాట్లపై సూచనలు ఇవ్వాలని కూడా కోర్టు ఇదే విచారణలో సూచించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది.