ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల రెండో రోజు సభ ప్రారంభం అయిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదని.. సీఎంగా పని చేసిన వ్యక్తి సభ్యత మరిచి ప్రవర్తించారని.. జగన్‌ను ఉద్దేశించి స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. తన పార్టీ సభ్యుల తీరును నియంత్రించాల్సింది పోయి.. కూర్చుని నవ్వుకుంటారా? అని స్పీకర్ నిలదీశారు. రానున్న రోజుల్లో ఇలాంటివి జరగడానికి వీల్లేదని.. ఇకనైనా జగన్ విజ్ఞతతో వ్యవహరించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.
కాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి సోమవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ అధినేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ మొత్తం పరిణామాలపై ఇవాళ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రానికి సీఎంగా పని చేసిన వ్యక్తి సభ్యతను మరిచి ప్రవర్తించారని జగన్ పై ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించడం సభా సాంప్రదాయాలను మంటగలపడమేనని అన్నారు.