ఏపీలోని కూటమి ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. సూపర్ సిక్స్ హామీల అమలు పైన మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా మరో ఎన్నికల హామీ అమలుకు అడుగులు వేస్తోంది. ఆడబిడ్డ నిధి కింద 18 - 59 ఏళ్ల మహిళల ఖాతాల్లో నెలకు రూ.1500 చొప్పున జమ చేయడంపై మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
సెర్ప్ కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాల అమలుకు విధివిధానాలు రూపొందించాలని సూచించారు. ఇందుకు ఏడాదికి రూ.5 వేల కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో మహిళలకు ఆర్థికంగా కొంత భరోసా నింపే దిశగా.. ప్రతి నెలా లబ్ధిదారులకు రూ.1500 చొప్పున డీబీటీ మోడ్ ద్వారా నేరుగా వారి ఖాతాకు డబ్బుల్ని జమ చేస్తారని సమాచారం. త్వరలోనే మార్గదర్శకాలను సిద్ధం చేసి.. పథకాన్ని అమలు చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.