అమరావతిని రాజధాని అభివృద్ధి చేయాలంటూ.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీ లేదన తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్ట ప్రకారం వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది. అమరావతి నుండి కార్యాలయాలను తరలించకూడదని తెలిపింది. చట్టాన్ని శాసనసభకు లేని అధికారాలతో రద్దు చేయలేరని పేర్కొంది. శాసన అధికారం లేనప్పుడు చట్టం రద్దు కుదరదని తెలిపింది. అలాగే పిటిషనర్లందరికీ ఖర్చుల కోసం రూ. 50 వేలు చొప్పున చెల్లించాలని తీర్పు చెప్పింది.
రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు వచ్చే 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో కూడిన అభివృద్ధి ప్లాట్లను అప్పగించాలని తెలిపింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని సూచించింది. రాజధాని అవసరాలకు తప్పితే.. ఇతర అవసరాల కోసం భూమిని తాకట్టు పెట్టడానికి వీల్లేదని పేర్కొంది. 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులను పూర్తి చేయాలంటూ తీర్పు వెలువరించింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టంపై ఇరుపక్షాల వాదనల అనంతరం ఏపీ హైకోర్టు.. ఇవాళ తీర్పును వెలువరించింది.