అమరావతి: వరద బాధితులకు నేడు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించనుంది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల చాలా మంది తీవ్రంగా నష్టపోయారు. విజయవాడ నగరంలో సగ భాగం బుడమేరు ముంపుకు గురై పది రోజుల పాటు ముంపులో ఉండిపోవడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వరద బాధితులకు పరిహారం ప్రకటించింది. సీఎం చంద్రబాబు నాయుడు.. ఇవాళ విజయవాడ కలెక్టరేట్ నుంచి బాధితులకు పరిహారాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు.
వరద ముంపు సాయంగా దాదాపు 4 లక్షల మంది బాధితులకు రూ.597 కోట్ల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి, విజయవాడలో లక్షన్నర మంది బాధితులకు వరద సాయం అందించనుంది. భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఆస్తులకు, పంటలకు నష్టం జరిగింది. ముంపు ప్రభావిత 179 సచివాలయాల పరిధిలో అత్యంత పారదర్శకంగా నష్ట గణన ప్రక్రియను పూర్తిచేసి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు.
వరద బాధితులకు నష్ట పరిహారం ప్యాకేజీని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. వరదల్లో నష్టపోయిన వాహనాలకు బీమా చెల్లింపు కార్యక్రమం త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.