అమరావతిలో భూ సేకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం
రాజధాని ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik
అమరావతిలో భూ సేకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి: రాజధాని ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంక్ రోడ్ల నిర్మాణానికి అదనపు భూమి అవసరం కావడంతో భూ సేకరణ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 1800 ఎకరాలు భూ సేకరణ చేయాలని నిర్ణయించింది. అయితే భూ సమీకరణకు కొందరు రైతులు అంగీకరించడంలేదని తెలిపింది. దీంతో భూ సేకరణ వైపు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ మేరకు సీఆర్డీఏ పరిధిలో రెవెన్యూ ఉద్యోగుల నియామకానికి అథారిటీ ఆమోదం తెలిపింది. మరో వైపు రాజధాని అమరావతి 217 చదరపు కిలోమీటర్లు పరిధిలో లో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇవ్వని రైతులు ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్‌కు ముందుకు రాని రైతుల విషయంలో భూ సేకరణకు సీఆర్డీఏ ఆధార్టీ ఆమోదం తెలిపింది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం అమరావతిలో భూ సేకరణ కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ట్రంక్ రోడ్లు ఏడాదిన్నర లో పూర్తి అవుతాయి. ట్రంక్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి కొంత భూమి అవసరం. సుమారు 1800 ఎకరాలు భూమి అవసరం ఉంది. రైతులు భూ సమీకరణకు అంగీకరిస్తే మంచిది... లేకపోతే భూ సేకరణ చేపట్టాలని సీఆర్డీఏ ఆధార్టీ ప్రతిపాదించింది. వచ్చే మార్చి నాటికి 4వేల ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతాయి. వాటిలో మౌలిక సదుపాయాలు కల్పనకు ఆమోదం తెలిపాం..అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.