అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి పట్టం కడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది
By - Knakam Karthik |
అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి పట్టం కడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. బుధవారం లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టిన 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు-2026'కు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ చర్చలో టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించగా, వైఎస్సార్‌సీపీ ఎంపీలు మాత్రం నిరసనగా సభ నుండి వాకౌట్ చేశారు.
ఈ చట్ట సవరణ 2024 జూన్ 2 నుంచి అమల్లోకి వచ్చేలా నిబంధనలు రూపొందించారు. దీనివల్ల అమరావతికి ఏకైక రాజధానిగా తిరుగులేని చట్టబద్ధత లభించనుంది. చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందిస్తూ.. ఇది ఆంధ్రుల కలల రాజధాని అని, అమరావతి రైతుల త్యాగాల ఫలితమని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ పురందేశ్వరి సైతం ఏపీకి అమరావతి శాశ్వత రాజధాని అని స్పష్టం చేశారు.
లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రేపు (ఏప్రిల్ 2, గురువారం) రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం లభించి, రాష్ట్రపతి సంతకం పూర్తయితే ఇది అధికారిక చట్టంగా మారుతుంది. తద్వారా గతంలో నెలకొన్న మూడు రాజధానుల సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడనుంది.