ఏపీలో రాజకీయ వేడి.. ఒకే రోజు సీఎం జగన్‌, చంద్రబాబుల ప్రచారం ప్రారంభం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తమ ప్రచార కార్యక్రమాలను మార్చి 27వ తేదీన.. ఒకే రోజు ప్రారంభించనున్నారు.

By అంజి  Published on  25 March 2024 10:54 AM IST
Andhra Pradesh, Politics ,  YS Jagan, Chandrababu, APPolls

ఏపీలో రాజకీయ వేడి.. ఒకే రోజు సీఎం జగన్‌, చంద్రబాబుల ప్రచారం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ (ఏపీ)లో రాజకీయ వేడి క్రమంగా పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు తమ ప్రచార కార్యక్రమాలను మార్చి 27వ తేదీన.. ఒకే రోజు ప్రారంభించనున్నారు. రాయలసీమ ప్రాంతంలోని వారి వారి నియోజకవర్గాల నుంచి ఇరువురు నేతలు ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికను దాదాపు ఖరారు చేశాయి. దీంతో ప్రధాన పార్టీల దృష్టి ప్రచారం వైపు మళ్లింది. ఈ నెల 27వ తేదీ నుంచి సీఎం జగన్, చంద్రబాబు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇద్దరు ముఖ్య నేతలు ఒకేసారి ప్రచారం ప్రారంభించడం రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠను పెంచింది.

ఇప్పటికే తన 'సిద్ధం' కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమవుతున్న సీఎం జగన్, కడప జిల్లా ఇడుపులపాయ నుంచి 'మేమంతా సిద్ధం' పేరుతో తన ప్రచారాన్ని ప్రారంభించి ఉత్తరాంధ్ర వరకు కొనసాగించనున్నారు. ఈ నెల 27న జగన్ తన ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అదేరోజు సాయంత్రం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. 28న నంద్యాలలో లేదా ఆళ్లగడ్డలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించి సాయంత్రం నంద్యాలలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం ఎమ్మిగనూరులో జరిగే బహిరంగ సభకు హాజరయ్యే సీఎం జగన్ 29వ తేదీన కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలోకి ప్రచారం ప్రవేశిస్తుంది.

మరోవైపు ప్రతిరోజు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించేలా చంద్రబాబు ప్రచారం మార్చి 27 నుంచి మార్చి 31 వరకు సాగనుంది. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో బాబు ప్రచారం నిర్వహించనున్నారు. 29న రాప్తాడు, సింగనమల, కదిరి, శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలలో చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటించనున్నారు. చంద్రబాబు ఈరోజు, రేపు తన సొంత నియోజకవర్గంలో ప్రచారంలో గడపనున్నారు.

Next Story