ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌తో పాటు ఆయన తండ్రి, మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్‌ను బెదిరించిన ఘటనలో ముంబయికి చెందిన రుషాంత్ జయకుమార్ వాడ్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీఐ కార్యకర్తనని చెప్పుకుంటూ ఈ-మెయిల్స్ ద్వారా ఎంపీ, ఎమ్మెల్యేలకు బెదిరింపులకు పాల్పడిన నిందితుడు, ఆస్తుల చిట్టాను బయటపెడతానని హెచ్చరించారు. రూ.10 కోట్లు చెల్లిస్తే విషయం వదిలేస్తానని డిమాండ్ చేశాడు. వరుస బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో నిందితుడితో చర్చల నిమిత్తం తన తండ్రి ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ పీఏ ఆది వద్దకు వెళ్లమని చెప్పారు.
మైదుకూరుకు వచ్చిన నిందితుడు వాడ్కే తనను కత్తితో బెదిరించి రూ.70 వేల నగదు దోచుకుని పరారైనట్లు ఆది పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు దక్షిణ ముంబయిలో ఉన్నట్లు గుర్తించిన జిల్లా పోలీసులు, మహారాష్ట్ర పోలీసుల సహకారంతో అతడిని అరెస్టు చేసి కడపకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్ విధించడంతో కడప జైలుకు తరలించారు. నిందితుడు ఆర్టీఐ కార్యకర్త కాదని కూడా విచారణలో తేలింది.