ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఉదయం 9.05 – 9.45 గంటల మధ్య లాంఛనంగా ప్రారంభించనున్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా పాలనను ప్రజల చెంతకు మరింత దగ్గరగా తీసుకువెళ్లనున్నట్లు అధికారిక పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సత్వరాభివృద్ధి, సమగ్రాభివృద్ధి, సమానాభివృద్ధి, సర్వజనాభివృద్ధి, సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా పాలన వికేంద్రీకరణను చేపట్టామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అభివృద్ధి ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదన్నదే తమ లక్ష్యమని వైసీపీ నేతలు అంటున్నారు.
ఇక సోమవారం ఉదయం 9.05 గంటలకు 26 జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత మిగిలిన శాఖల జిల్లా అధికారులు బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత జిల్లా కేంద్రాలు, కొత్త జిల్లా కేంద్రాలకు కేటాయించిన ఉద్యోగులకు ఇప్పటికే ఆర్డర్ టు సెర్వ్ ఉత్తర్వులు జారీ చేయడంతో వారు కూడా విధుల్లో చేరనున్నారు. 9.45 గంటలలోపు అధికారులు, ఉద్యోగులు కొత్త జిల్లా కేంద్రాల్లో విధుల్లోకి రానున్నారు. పాత జిల్లా కేంద్రాలు, కొత్తగా ఏర్పడుతున్న 13 జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలు, కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయాలు, ఇతర జిల్లా కార్యాలయాలు ముస్తాబయ్యాయి. 70% కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని చోట మాత్రమే ప్రైవేట్ భవనాలు ఎంపిక చేశారు.