రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్‌కు బిల్లులు..అధికారులపై మంత్రి పయ్యావుల సీరియస్

రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపు వ్యవహారంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సీరియస్ అయ్యారు.

By Knakam Karthik  Published on  15 Feb 2025 1:08 PM IST
Telugu News, Andhra Pradesh, Vizag, Rushikonda Palace, Minister Payyavula Keshav

రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్‌కు బిల్లులు..అధికారులపై మంత్రి పయ్యావుల సీరియస్

విశాఖలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపు వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సీరియస్ అయ్యారు. కాంట్రాక్టర్‌కు బిల్లులు ఎందుకు చెల్లించారని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై మండిపడ్డారు. కాంట్రాక్టర్‌కు బిల్లులు ఎందుకు చెల్లించారో వివరణ ఇవ్వాలని మంత్రి పయ్యావుల అధికారులను ఆదేశించారు. కాగా రుషికొండ ప్యాలెస్ నిర్మాణ పనుల బిల్లులను చెల్లించలేదని.. అదే సంస్థ చేపట్టిన వేరే పనులకు బిల్లులు చెల్లింపులు చేసినట్లు అధికారులు వివరణ ఇచ్చారు.

దీనిపై మంత్రి స్పందిస్తూ.. వేరే బిల్లులైనా సరే.. ఎందుకు చెల్లించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కాంట్రాక్టర్‌కు ఎందుకు చెల్లింపులు జరపాల్సి వచ్చిందని ఫైర్ అయ్యారు. గతంలో దీని గురించి చెప్పినా.. వినకుంటే ఎలా అంటూ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అసలు ఆ కాంట్రాక్టర్‌కు జరిపిన చెల్లింపుల వివరాలు.. ఏయే పనులకు బిల్లులు చెల్లించారో నివేదిక ఇవ్వాలని మంత్రి పయ్యావుల ఆదేశించారు. చెల్లింపుల కోసం ఎవరైనా సిఫార్సు చేశారా? సొంత నిర్ణయమా? అంటూ అధికారులను ప్రశ్నించారు. ఇకపై ఆ కాంట్రాక్టర్ చేపట్టిన ఏ పనులకైనా చెల్లింపులు చేయొద్దని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు లేదా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలా కాకుండా చెల్లింపులు జరిపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story