ముఖ్యమంత్రి జగన్ నేడు(మంగళవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు సీఎం ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం ప్రధాని మోదీ, రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇప్పటికే వారి అపాయింట్‌మెంట్లు ఖరారైనట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు గురించి వివరించి కొత్త జిల్లాల ఆధారంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా పోలవరం సహా పెండింగ్ అంశాలను మోదీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. రాష్ట్రానికి మూడు రాజధానుల ఆవశ్యకతను వివరించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆ విషయం కూడా చర్చకు రావొచ్చునని తెలుస్తోంది.
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అనంతరం సీఎం రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు (బుధవారం) పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలవనున్నారు. అనంతరం రాష్ట్రానికి తిరిగి రానున్నారు.