ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి తన పుట్టినరోజున బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో పర్యటిస్తున్నారు. యడ్లపల్లిలోని ఆలపాటి వెంకట రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ప్రసంగించారు. సీఎం జగన్ చేతులమీదుగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజుస్ కంటెంట్‌తో ఉన్న ట్యాబ్‌లను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,18,740 ట్యాబ్‌లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆర్థిక స్థోమత వల్ల పిల్లలను చదివించుకోలేని తల్లిదండ్రుల బాధలను చూశానని, తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గమని అన్నారు. పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామని.. సమాజంలో ఉన్న అంతరాలు తొలగాలని, పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య అందకూడదనే పెత్తందారీ భావజాలం చూసి బాధ వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు మంచి విద్యా విధానంతో పిల్లల తలరాతలు మారతాయని, భావి తరాల పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని చెప్పారు. చదువులో సమానత్వం ఉంటేనే ప్రతి కుటుంబం అభివృద్ధి చెందుతుందని సిఎం జగన్ చెప్పుకొచ్చారు. రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. నెట్‌తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చూసే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. ఏటా 8వ తరగతిలోకి వచ్చిన విద్యార్థులందరికీ ట్యాబ్‌లు అందిస్తామని చెప్పారు. ట్యాబ్‌ల ద్వారా విద్యార్థులకు సులువుగా పాఠాలు అర్థమవుతాయన్నారు.