ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తరుపున ప్రచారం చేయనున్నారు. నివేదికల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదివారం ఢిల్లీకి వెళ్లి తెలుగు జనాభా గణనీయంగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ర్యాలీలలో పాల్గొంటారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో టీడీపీ అతిపెద్ద భాగస్వామ్య పార్టీలలో టీడీపీ ఒకటి. ఈ కారణంగానే కొద్ది రోజుల క్రితం జరిగిన మహరాష్ట్ర ఎన్నికలలో సైతం బీజేపీ తరుపున చంద్రబాబు ప్రచారం చేశారు. మరో ఎన్డీఏ మిత్రపక్షం జనసేన పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఢిల్లీలో దాదాపు 10 లక్షల మంది తెలుగు మాట్లాడే ఓటర్లు ఉన్నారు. చంద్రబాబు, పవన్‌ల ఉనికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో సీట్లను ప్రభావితం చేయగలదని బీజేపీ భావిస్తుంది. ఈ క్రమంలోనే ఇరువురు నేతలతో ప్రచారం చేయించేదుకు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తుంది.