వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల సోమవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కర్నూలు డీఎస్పీ కార్యాలయంలో ఆమెను సుమారు రెండు గంటల పాటు విచారించారు. ఈ కేసులో శ్యామలతో పాటు మరో 26 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
బస్సు ప్రమాదానికి బెల్టు షాపుల్లో విక్రయిస్తున్న నకిలీ మద్యమే కారణమంటూ యాంకర్ శ్యామల సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. దీనిపై కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఆమెతో సహా మొత్తం 27 మందిపై కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. డీఎస్పీ బాబు ప్రసాద్ శ్యామలను సుమారు రెండు గంటల పాటు విచారించి, దాదాపు 65 ప్రశ్నలు సంధించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన శ్యామల, పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని తెలిపారు.