తెలుగు రాష్ట్రాల వారికి పరిచయం అక్కర్లేని పేరు ఆనందయ్య..! కరోనా మందు కనిపెట్టాడంటూ ఒకప్పుడు ఆయన పేరు దేశం మొత్తం వినిపించింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఫేమ్ అంతా మాయమైంది. తాజాగా ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా చికిత్స కోసం తాను కనిపెట్టిన మందు ప్రజల్లోకి వెళ్లకుండా చాలా అడ్డంకులు సృష్టించారని తీవ్ర విమర్శలు చేశారు. గ్రామస్థులంతా ఆ సమయంలో అండగా నిలవడం వల్లే అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు వెనుదిరిగారని ఆనందయ్య తెలిపారు. యాదవ మహాసభ సమితి సోమవారం విజయనగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆయుర్వేదానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం లభించాల్సి ఉందన్నారు.
తన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయించడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నించిందని కృష్ణపట్నం గ్రామస్తుల మద్దతుతోనే నిలబడగలిగానని అన్నారు. ప్రజల్లో తనకున్న ఆదరణ చూసి పోలీసులు కూడా భయపడ్డారన్నారు. కరోనా సమయంలో మందు పంపిణీ చేసేందుకు సిద్ధమైతే ప్రభుత్వం అనుమతి లేదని చెప్పిందన్నారు ఆనందయ్య. బీసీలు అండగా నిలిచారని.. పోరాటానికి సిద్ధమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కూడా ఇబ్బంది వస్తుందని భావించి కోర్టు ఆదేశాలతో అనుమతి ఇచ్చిందన్నారు.