బ్లాక్ మార్కెట్ లో ఆనందయ్య కరోనా మందు
Anandaiah Ayurvedic Corona Medicine. కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..!
By Medi Samrat Published on 22 May 2021 3:26 PM ISTకృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! అయితే ఈ కరోనా మందుపై కొందరు బ్లాక్ మార్కెట్ రాయుళ్లు పడ్డారు. ప్రస్తుతం ఒక వారం పదిరోజుల పాటూ కరోనాకు ఆనందయ్య మందు దొరకడం లేదు. దీంతో ఆ కరోనా మందు తమ దగ్గర ఉంది అంటూ పలువురు అమ్మకాలు మొదలుపెట్టారు. అది నిజమో.. కాదో కూడా తెలియని పరిస్థితి. కొందరు నిజమైన మందేమో అనుకుని కొనేస్తూ ఉన్నారు. ఏకంగా 3000 రూపాయల నుండి 10వేల రూపాయల వరకూ ఆనందయ్య కరోనా మందు అంటూ అమ్మకాలు మొదలుపెట్టేశారు. చాలా మంది కొంటూ ఉన్నారు కూడానూ..!
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి కొద్దిరోజుల పాటు బ్రేక్ పడింది. కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. శనివారం ఉదయం ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయుర్వేద మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, పంపిణీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం అనుమతి వచ్చే వరకు మందు పంపిణీ లేదని.. మందు కోసం ఎవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆనందయ్యకు పోలీసులు అదనపు భద్రత కల్పించారు.
ఆనందయ్య మందుపై కృష్ణపట్నంలో ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతుండగా, ఇవాళ ఐసీఎంఆర్ టీమ్ తో కలిసి మరింత లోతుగా అధ్యయనం చేయనున్నారు. ఐసీఎంఆర్ బృందం కరోనా ఆయుర్వేద మందుగా ఆనందయ్య తయారుచేసే వివిధ చెట్ల ఆకులు, పదార్థాలను పరిశీలించారు. తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయుర్వేద మందు లో ఏమేమి వస్తువులు కలుపుతున్నారు ఎలా తయారు చేస్తున్నారు అనే విషయాలను దగ్గరుండి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయుర్వేద మందు వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదా అనే విషయాన్ని ఐసీఎంఆర్ బృందం ప్రధానంగా దృష్టి సారించింది.