మాజీ టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేయడం తెలుగు రాజకీయాల్లో సంచలనం రేపింది. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన రాయుడు.. రెండు వారాలు కూడా గడవకముందే పార్టీని వీడడంతో తీవ్ర చర్చకు దారితీసింది. గుంటూరు ఎంపీ సీటు ఇవ్వనందువల్లే రాయుడు వైసీపీని వదిలేశాడని ప్రచారం జరుగుతోంది. టీడీపీ కూడా రాయుడుకు ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఈ ప్రచారానికి తెరదించేందుకు రాయుడు స్వయంగా రంగంలోకి దిగాడు.
ట్విటర్ వేదికగా ఈ ప్రచారానికి పుల్‌ష్టాప్ పెట్టాడు. రాయుడు పోస్టులో.. "నేను ఇంటర్నేషనల్ లీగ్ టీ20 పోటీల్లో పాల్గొంటున్నాను. జనవరి 20 నుంచి దుబాయ్ లో జరిగే ఈ పోటీల్లో నేను ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అయితే, ఈ టోర్నీలో పాల్గొనే ప్రొఫెషనల్ ఆటగాళ్లకు ఎలాంటి రాజకీయ సంబంధాలు ఉండకూడదన్న నిబంధన ఉంది" అంటూ ట్వీట్ చేశాడు.