ప్రభుత్వంపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. బుధవారం మీడియాతో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న మంచి పనులను నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రజల్లోకి వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. నెలలో 20 రోజులపాటు ప్రజల వద్దే ఉండి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు.
పథకాలు లబ్ధిదారులకు చేరకపోవడానికి గల కారణాలను తెలుసుకోవాలని సీఎం జగన్ నాయకులను ఆదేశించినట్లు తెలిపారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై టీడీపీ విమర్శలు చేస్తోందని, సీఎం జగన్ పథకాలు, పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మంత్రి అన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని, నిధులను నేరుగా ప్రజలకు అందజేశామని చెప్పారు. కుప్పంతో పాటు 175 ఎమ్మెల్యే స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.