ఖరీఫ్‌ సాగుకు నీటిని విడుదల చేసిన మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu releases Godavari water for Kharif season today. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం రైతులను

By Medi Samrat  Published on  1 Jun 2022 1:57 PM IST
ఖరీఫ్‌ సాగుకు నీటిని విడుదల చేసిన మంత్రి అంబటి రాంబాబు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు మరో ముందడుగు వేసింది. ఖరీఫ్‌ సాగుకు ముందుగానే గోదావరి నీటిని విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం విజ్జేశ్వరం సమీపంలోని డెల్టా కాలువలకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బుధవారం నీటిని విడుదల చేశారు.

విజ్జేశ్వరం హెడ్ స్లూయిస్ నుంచి పశ్చిమ డెల్టా కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. తద్వారా 5.29 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై జలవనరుల శాఖ మంత్రి అంబటి మండిపడ్డారు.

కాపర్ డ్యాం పూర్తికాకముందే టీడీపీ ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టిందని, అందుకే ఈ అనాలోచిత పనుల వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోందన్నారు. భారీ ప్రాజెక్టు నిర్మాణంలో కచ్చితంగా జాప్యం జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టులో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. ఫలానా తేదీలోగా పోలవరం పూర్తవుతుందా లేదా అన్న విషయంపై స్పష్టత లేదన్నారు. వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు విస్తృతంగా కృషి చేస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.













Next Story