గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేరుతో ఓ ఆడియో వైరల్ అవుతూ ఉంది. దీనిపై అంబటి రాంబాబు స్పందించారు. తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఉద్దేశపూరకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. సోషల్ మీడియా వేదికగా తనపై కావాలని దుష్ప్రచారంతో కుట్ర జరిగిందని, తాను మాట్లాడని మాటలు, తన వాయిస్ కాకపోయినా ఒక తప్పుడు ప్రచారం చేసి తన పరువు ప్రతిష్టలను దెబ్బ తీయాలనే ప్రయత్నం కుట్రపూరితంగా ఒక వర్గం చేస్తున్నట్లు అర్ధమైందన్నారు. వారు ఎవరు ఏంటి అన్నది త్వరలోనే బయటకొస్తుందన్నారు.
10 ఏళ్ల క్రితం ఓ ప్రముఖ ఛానల్ ఇదే విధంగా దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం జరిగిందన్నారు. ఆ ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని కోర్టులో తప్పుగా నిరూపణ చేశామన్నారు. ఈ మధ్య కాలంలో తప్పుడు ప్రచారం చేయాలనే ఉద్దేశంతో కొందరు ప్రయత్నం చేస్తున్నారన్నారని, అందుకే ఆడియోలు, వీడియోలు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు. వైసీపీ కార్యకర్తలు, ప్రజలు ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన అన్నారు. ఎవరైతే ఇలా ప్రచారం చేస్తున్నారో వారి మీద చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోబోతున్నామన్నారు.