కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తాం : మంత్రి అంబటి రాంబాబు
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం, జల్ శక్తి తీసుకున్న నిర్ణయంపై
By Medi Samrat Published on 7 Oct 2023 12:00 PM GMTబ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం, జల్ శక్తి తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. శనివారం విజయవాడలోని జల వనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ఇచ్చిన అవార్డు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని భావిస్తున్నామన్నారు. ఇప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ కొత్త విధివిధానాలు ఇస్తూ గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో ఈ విషయంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి న్యాయపోరాటం చేస్తామని మంత్రి వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ కొత్తగా విధి విధానాలు రూపొందించడానికి తాము ఒప్పుకోమని మంత్రి అన్నారు.
ఇప్పటికే బచావత్ ట్రిబ్యూనల్ అనుసరించి నీటి పంపకాల నిర్ణయాలు ప్రామాణికంగా జరుగుతున్నాయని మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్తగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ కు విధి విధానాలు అప్పగించడమేంటని మంత్రి ప్రశ్నించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ పొడిగించడం ఏపీకి ఆమోద యోగ్యం కాదన్నారు. ఇది ముమ్మాటికి అన్యాయమని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతున్నామన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ 2010లో తుది నివేదిక ఇచ్చిందని మంత్రి గుర్తుచేశారు. అయితే ఏపీకి నష్టం జరుగుతుందని సుప్రీంకోర్టులో వేసిన ఎస్ఎల్ పీ పై స్టే విధించడం జరిగిందన్నారు. ఇప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ కు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ను ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ లో సెక్షన్ 89లో నిర్ధేశించారని, మళ్లీ కొత్తగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఇది చట్టవిరుద్ధమన్నారు.
రాష్ట్రంలో అన్నదాతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వమని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు కాపాడటమే తమకు ముఖ్యమన్నారు. నీటి వాటాల విషయంలో రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగే అవకాశమున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టామని చెప్పారు. రైతాంగానికి నీళ్లు అందించే విషయంలో రాజీపడబోమన్నారు. న్యాయపోరాటంలో తాము గెలుస్తామన్నారు.