తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కంటే తక్కువ మద్యం ధరలు ఉండేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ రూపొందిస్తున్నట్టు సమాచారం. 2019 కంటే ముందు ఆంధ్రప్రదేశ్‌లో అమలైన పాలసీనే మళ్లీ తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పాలసీపై కసరత్తు తుది దశకు చేరుకుంది. విధివిధానాలను కేబినెట్ సబ్ కమిటీ దాదాపు ఖరారు చేసింది. అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని కమిటీ నిర్ణయించింది. కేబినెట్ ఆమోదం తర్వాత అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీలో అమలు అవుతున్న లిక్కర్ పాలసీ ఈ నెలాఖరుతో ముగియనుంది.
దీంతో కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఈ నెల 17వ తేదీన కేబినెట్ సబ్ కమిటీ తుది సమావేశం కానుంది. ఈ నెల18న కేబినెట్ కొత్త లిక్కర్ పాలసీ ప్రతిపాదనలను ఉంచాలని నిర్ణయించారు. కేబినెట్ ఆమోదం తర్వాత కొత్త పాలసీని ప్రకటించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత కొత్త లిక్కర్ పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. గత ప్రభుత్వ మద్యం విధానం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నదని.. అందుకోసమే కొత్త లిక్కర్ పాలసీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.