ఏపీలోని గన్నవరం విమానాశ్రయంలో గత శనివారం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి గల కారణాలను డీజీసీఏ తేల్చింది. ఈ ప్రమాదానికి కారణంగా పైలట్ తప్పిదమేనని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో ఫిబ్రవరి 20న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పినట్లయింది. దోహా నుంచి గన్నవరానికి వచ్చిన ఈ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానం ఒక రెక్క స్వల్పంగా దెబ్బతింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 64 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆప్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి పైలట్ తప్పిదమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానాన్ని కెనడాకు చెందిన మహిళ పైలట్ నడుపుతున్నారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి బుధవారం కూడా విచారణ కొనసాగనుంది.