రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన పార్టీ స్ట్రాటజీ కమిటీలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అంశంపై ఇప్పటిదాకా టీడీపీ నుండి ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌కు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ఈ విషయంపై చర్చించేందుకు పార్టీ అధినేత స్ట్రాటజీ కమిటీ భేటీని నిర్వహించారు. టీడీపీ స్ట్రాటజీ కమిటీ భేటీలో భాగంగా పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ముకు మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
సామాజిక న్యాయానికి టీడీపీ ఆది నుంచి మద్దతు ఇస్తోందని, ఆ మేరకే ముర్ముకు మద్దతు ఇచ్చే దిశగా నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్న ద్రౌపది ముర్ము వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు కోరేందుకు మంగళవారం విజయవాడకు వస్తున్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో మంగళగిరి సమీపంలోని కన్వెన్షన్ హాల్‌లో జరిగే వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశంలో ఆమె పాల్గొంటారు. ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరనున్నారు.