ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించాలని అనుకుంటూ ఉండగా..కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం అవసరమా అని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. పరీక్షలను అసలు పెట్టకూడదని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సర్కారు పబ్లిక్ పరీక్షలను వాయిదా వేయాల్సిందేనని.. పరీక్షలు నిర్వహించాలన్న మొండివైఖరిని సర్కారు వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. పరీక్షలు చేపట్టాలని ప్రభుత్వం ముందుకు వెళితే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని లోకేశ్ హెచ్చరించారు. కరోనా సోకితే కనీసం ఆసుపత్రుల్లో బెడ్ కూడా దొరకని పరిస్థితి ఉందని, ఔషధాలకూ విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ ఎంతో ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నా ప్రభుత్వానికి తలకెక్కడంలేదని విమర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పరీక్షలు వద్దనే కోరుకుంటున్నారని, తాము వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేకరణ జరిపితే 80 శాతం మంది పరీక్షలు ఇప్పుడు వద్దంటున్నారని వివరించారు.

నారా లోకేష్ వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యంతో పాటు చదువు కూడా ముఖ్యమేనని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందని.. పదో తరగతి పరీక్షలు మొత్తం 11 ఉంటే, ప్రస్తుత పరిస్థితుల్లో తాము వాటిని 7కి కుదించామని అన్నారు. విపక్షాలు పరీక్షల అంశంలో రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పదో తరగతి పరీక్షలపై ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని ఆదిమూలపు సురేశ్ చెప్పుకొచ్చారు.


సామ్రాట్

Next Story