సంక్రాంతి సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాసంస్థలు సోమవారం తెరుచుకున్నాయి. అయితే, రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, టీడీపీతో పాటు విపక్షాలు సెలవులను పొడిగించాలని కోరుతున్నాయి. కాగా, ఈ విషయమై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందిస్తూ.. విద్యార్థుల రోజువారీ హాజరును తీసుకుంటున్నామని, విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
90 శాతం విద్యార్థులకు టీకాలు వేయించామని, ఉపాధ్యాయులకు టీకాలు వేయడం పూర్తయిందని మంత్రి స్పష్టం చేశారు. క్లాస్‌లు అన్ని జాగ్రత్తలతో జరుగుతాయని ఆయన వెల్లడించారు. గత 150 రోజులుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా పాఠశాలలు నిరంతరం నడిచాయని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు పాఠశాలలు నిర్వహిస్తున్నామని ఆదిమూలపు సురేష్ వివరించారు. కోవిడ్-19 వ్యాప్తికి, పాఠశాలలకు ఎలాంటి సంబంధం లేదని, అత్యవసర పరిస్థితుల్లో తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.