గుడ్‌న్యూస్.. ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పియం కిసాన్ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు.
By Medi Samrat
ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పియం కిసాన్ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. ఈఅంశంపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రైతులకు ఆర్దికంగా మరింత చేయూతను అందించే లక్ష్యంతో సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి 20వేల రూ.లు వంతున అన్నధాత సుఖీభవ-పియం కిసాన్ కింద సహాయం అందించడం జరుగుతోందని తెలిపారు.ఈపధకానికి సంబంధించి ఇంకా ఇ-కెవైసి మరియు ఎన్సిపిఐ మ్యాపింగ్ కానివారు వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సంప్రందించి ఇ-కెవైసి మరియు మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని చెప్పారు. ఈపధకం అమలుకు ఇంకా మరో మూడు రోజులు వరకూ సమయం ఉన్నందున ఈరెండు అంశాలు పెండింగ్లో ఉన్న రైతులందరూ తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని ఆయన సూచించారు.
అదే విధంగా ఇ-కెవాసి,ఎన్సిపిఐ మ్యాపింగ్ కాని రైతులందరూ త్వరితగతిన వాటిని చేయించుకోవాలని ఆర్టీజిఎస్ ద్వారా ఆయా రైతులందరికీ సంక్షిప్త సందేశం(ఎస్ఎంఎస్) పంపాలని ఆర్టీజిఎస్ సిఇఓను సిఎస్ విజయానంద్ ఆదేశించారు.అన్నధాత సుఖీభవ-పియం కిసాన్ పధకానికి అనర్హులుగా గుర్తించి తిరస్కరించబడిన వారికి ఎందుకు అనర్హులుగా గుర్తించి తిరస్కరించడం జరిగిందనే దానిపై వ్యవసాయశాఖ అధికారులు రైతు సేవా కేంద్రాల ద్వారా స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు.అంతేగాక తిరస్కరించబడిన వారి వివరాలను రానున్న మూడు రోజుల్లో అనగా ఆగస్టు 1వ తేదీలోగా మరొకసారి క్షుణ్ణంగా పరిశీలన జరిపి ఎక్కడైనా అర్హత గల వారిని గుర్తిస్తే వెంటనే వారిని అర్హుల జాబితాలో చేర్చాలని స్పష్టం చేశారు.కొంతమంది రైతులకు సంబంధించిన భూమి మ్యూటేషన్ ప్రక్రియ చేయకపోవడం, ఆధార్ సీడింగ్ సరిగా నమోదు కాకపోడవం,చనిపోయిన వారికి సంబంధించిన అంశాలపై రెవెన్యూ శాఖ తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఈపధకం వర్తించలేదని రైతుల నుండి ఫిర్యాదులు వస్తుంటాయని కావున వాటిపై రెవెన్యూశాఖ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.దీనిపై గురువారం నిర్వహించే కలక్టర్ల వీడియో సమావేశంలో కూడా చర్చించడం జరుగుతుందని సిఎస్ విజయానంద్ పేర్కొన్నారు.
అంతకు ముందు వ్యవసాయశాఖ సంచాలకులు ఢిల్లీ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈపధకం అమలుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ ఈపధకం కింద లబ్ది పొందాలంటే ఇ-పంట మరియు ఇ-కెవైసిలో నమోదు తప్పనిసరని స్పష్టం చేశారు. అన్నధాత సుఖీభవ-పియం కిసాన్ కు సంబంధించి రైతులు వారి స్టేటస్ ను అన్నదాత సుఖీభవ పోర్టల్ మరియు మనమిత వాట్సప్ గవర్నెస్ యాప్ ద్వారా తెలుసుకో వచ్చని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ టోల్ ప్రీ నంబరు 155251 కు ఫోన్ చేసి తెల్సుకోవచ్చని తెలిపారు.