రేషన్ షాపు కంటే బహిరంగ మార్కెట్ ఉత్తమం అనే పరిస్థితి తీసుకొచ్చారు

Acham Naidu Fires On YSRCP Govt. సమస్యల పరిష్కారం కోరుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు

By Medi Samrat  Published on  26 Oct 2021 9:10 AM GMT
రేషన్ షాపు కంటే బహిరంగ మార్కెట్ ఉత్తమం అనే పరిస్థితి తీసుకొచ్చారు

సమస్యల పరిష్కారం కోరుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామ‌ని టీడీపీ అధ్య‌క్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రేషన్ డీలర్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిస్తే.. ప్రస్తుతం డీలర్లను కేవలం స్టాకిస్టులా పేర్కొంటూ నామమాత్రం చేయడాన్ని తీవ్రంగా గర్హిస్తున్నామ‌న్నారు. గౌరవ వేతనం అందించాం. గోనె సంచుల్ని అమ్ముకుని కొంత ఆదాయం పొందేలా వెసులుబాటు కల్పించాం. ప్రస్తుతం ఆ ఖాళీ గోతాలను కూడా ప్రభుత్వానికి అందించాలంటూ జీవో ఇచ్చి డీలర్లపై పెత్తనం చేస్తున్నారని మండిప‌డ్డారు.

గతంలో అందే సదుపాయాలన్నింటినీ రద్దు చేయడమే కాకుండా.. వాలంటీర్లు, మొబైల్ వాహనాల పేరుతో డీలర్లను డమ్మీలుగా చేశారు. మరోవైపు.. కరోనా సమయంలో పంపిణీ చేసిన ఉచిత రేషన్ సరుకులకు సంబంధించిన కమిషన్ కూడా ఇవ్వలేదు. కరోనా ఉధృతంగా విజృంభించిన సమయంలోనూ పేదలకు రేషన్ సరుకులు అందించిన వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని ఎన్ని వినతులిచ్చినా ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని అన్నారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 54 మంది డీలర్లు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతే.. కనీస పరిహారం కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.

తెలుగుదేశం ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పదుల సంఖ్యలో సరుకుల్ని అందించి.. పేదలకు అండగా నిలిచిందని.. కానీ నేడు రేషన్ షాపు కంటే బహిరంగ మార్కెట్ ఉత్తమం అనే పరిస్థితి తీసుకొచ్చారని దుయ్య‌బ‌ట్టారు. డీలర్ల సంక్షేమాన్ని సమర్ధంగా అమలు చేసి, రేషన్ వ్యవస్థను పటిష్టం చేస్తే.. జగన్ రెడ్డి రేషన్ వ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. డీలర్లు చేసే నిరసన కార్యక్రమాలతో పాటు.. భవిష్యత్తులో చేసే పోరాటాలకు టీడీపీ అండగా నిలుస్తుందని మ‌ద్ద‌తు తెలిపారు.


Next Story