తిరుమల లడ్డూపై అపవిత్రం ఆరోపణలు.. చంద్రబాబు, లోకేష్‌కు వైసీపీ సవాల్
తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.
By అంజి Published on 19 Sept 2024 7:36 AM ISTతిరుమల లడ్డూపై అపవిత్రం ఆరోపణలు.. చంద్రబాబు, లోకేష్‌కు వైసీపీ సవాల్
తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. నెయ్యికి బదులుగా జంతువుల నూనె వాడారని తెలిసిందన్నారు. విషయం తెలిసి చాలా ఆందోళన చెందానని, ఇప్పుడు తాము స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామన్నారు. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అన్నదానం కూడా సరిగ్గా నిర్వహించలేదని, ఇప్పుడు నాణ్యత పెరిగిందని, ఇంకా పెంచుతామని స్పష్టం చేశారు.
కాగా తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. కోట మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసి చంద్రబాబు పెద్దపాపమే చేశారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా ఆయన వెనకాడరని మరోసారి నిరూపితమైందన్నారు. ఈ విషయంలో ఆ దేవదేవుని సాక్షిగా కుటుంబంతో కలిసి ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, చంద్రబాబు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఈ విషయంపై వైసీపీ ఘాటుగా స్పందించింది.
తిరుమల లడ్డూ అపవిత్రంపై చంద్రబాబు, లోకేష్, వారి కుటుంబం ప్రమాణం చేయడానికి రెడీగా ఉన్నారా? తాము సవాల్ చేస్తున్నామని రాసుకొచ్చింది. సీఎం చంద్రబాబు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని వైసీపీ మండిపడింది.
చంద్రబాబు ఆరోపణలను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. దేవుడి పేరుతో రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని, వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాయుడు ఇలాంటి ఆరోపణలు చేశారని టీటీడీ మాజీ ఛైర్మన్ అన్నారు.