ఫైబర్ నెట్ కేసులో ఊహించని పరిణామం
విజయవాడ ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ తగిలింది. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ కు
By Medi Samrat Published on 12 Oct 2023 6:23 PM ISTవిజయవాడ ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ తగిలింది. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతించింది. సీఐడీ వేసిన పీటీ వారంట్ పై వాదనలను విన్న తర్వాత కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. సోమవారం నాడు చంద్రబాబును ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టులో చంద్రబాబు తరపున దమ్మాలపాటి శ్రీనివాస్, సీఐడీ తరపున వివేకానంద వాదనలు వినిపించారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ఈ కేసులో చంద్రబాబు తరపున విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశామని... ఈ పిటిషన్ పై సుదీర్ఘ వాదనల అనంతరం బెయిల్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించిందని చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు ఏ37గా ఉన్నారని, ఇప్పటికే రెండు రోజుల సీఐడీ కస్టడీలో బాబు ఉన్నారని చెప్పారు. సీఐడీ తరపు న్యాయవాది స్పందిస్తూ... ఈ అంశంపై తాము ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాల్సి ఉందని, తాము కౌంటర్ దాఖలు చేస్తామని, తమకు కొంత సమయం కావాలని హైకోర్టును కోరారు. దీంతో, తదుపరి విచారణను హైకోర్టు 17వ తేదీకి వాయిదా వేసింది.