విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీని పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఆటోలో ఉన్న ఎనిమిది మంది చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. నగరంలోని శరత్ సినిమా హాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చిన్నారులు బేతానీ స్కూల్ విద్యార్థులుగా గుర్తించారు. ఘటనాస్థలంలో హృదయవిదారక దృశ్యాలు కనిపించాయి. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది.
చిన్నారులు ప్రమాదానికి గురికావడంతో వాహనదారులు, స్థానికులు వెంటనే స్పందించారు. చిన్నారులకు ఫస్ట్ ఎయిడ్ అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ ప్రమాద స్థలం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రమాద స్థలంలో రోడ్డుపై చిన్నారులు చెల్లచెదురుగా గాయాలతో పడ్డారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారందరనీ తీవ్రంగా కలచి వేశాయి. గాయపడిన వారిలో కొందరు అపస్మారక స్థితికి చేరుకున్నారు.