Andhra Pradesh : గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు
ఎన్నికల మేనిఫెస్టో అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేరుస్తోంది
By - Medi Samrat |
ఎన్నికల మేనిఫెస్టో అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేరుస్తోంది. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్రంలోని సొంత ఇల్లు లేని పేదలకు ఇళ్లు ఇస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఈ హమీ అమల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్దిదారులకు ప్రభుత్వం కేటాయించింది. నిర్మాణం పూర్తి చేసిన ఈ ఇళ్లలో ఒకేమారు లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేయనున్నారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 3 లక్షల ఇళ్లలో లబ్దిదారుల గృహ ప్రవేశాలు జరుగనున్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లి గ్రామంలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొనడంతో పాటు...రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను వర్చువల్ గా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. లబ్దిదారులకు ఇంటి తాళాలు అందించనున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-బీఎల్సీ కింద నిర్మించిన 2,28,034 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణ్ కింద 65,292 ఇళ్లు, పీఎంఏవై జన్మన్ పథకం కింద మరో 6,866 ఇళ్లలో లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేయనున్నారు. మొత్తంగా 3,00,192 ఇళ్లకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఈ గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానం ద్వారా దాదాపు ఉచిత ఇసుక విధానంతో దాదాపు 20 టన్నుల ఇసుక ఉచితంగా పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది.
పేదలకు గూడు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత
2014 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వివిధ విభాగాల్లో 8 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలోనే 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. గత పాలకులు పేదల సొంతింటి కలల్ని కూల్చేసింది. 4.73 లక్షల ఇళ్లు రద్దు చేసింది. 2.73 లక్షల మంది లబ్దిదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని బకాయి పెట్టింది. గత ప్రభుత్వం నిలిపేసిన ఇళ్ల నిర్మాణాలకు చెందిన బకాయి బిల్లులను దశల వారీగా కూటమి ప్రభుత్వమే చెల్లించింది. ప్రస్తుతం పూర్తి చేసిన ఈ ఇళ్లనే కాకుండా.. మరిన్ని ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 3 లక్షల ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయా జిల్లాల నుంచి మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా ఈ సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొననున్నారు.