చంద్రబాబును కలిసిన 2018 గ్రూప్-1 అభ్యర్థులు
2018 Group-1 Candidates Meet With Chandrababu. 2018 గ్రూప్-1 నోటిఫికేషన్ ఇంటర్వ్యూ జాబితా నుంచి తమను తొలగించారని
By Medi Samrat Published on 1 Jun 2022 2:30 PM GMT2018 గ్రూప్-1 నోటిఫికేషన్ ఇంటర్వ్యూ జాబితా నుంచి తమను తొలగించారని, తమకు న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థులు టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి కోరారు. డిజిటల్ మూల్యాంకనంకు, సాధారణ మూల్యాంకనంకు ఫలితాల్లో భారీ తేడా ఉందని చెప్పారు. మూల్యాంకనంలో జరిగిన అవకతవకల కారణంగా 202 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ జాబితా నుంచి తొలగించబడ్డారని చంద్రబాబుకు వివరించారు. సాధారణ మూల్యాంకనం పేరుతో APPSC పెద్దలు అక్రమాలకు పాల్పడ్డారని, తమకు న్యాయం జరిగేలా చూడాలని చంద్రబాబుకు విన్నవించుకున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 30కి పైగా సీబీఐ, ఈడీ కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న సీఎం జగన్‌రెడ్డి నిర్వహణలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కూడా అవకతవకలతోనే సాగిందని.. అత్యంత పారదర్శకంగా డిజిటల్ మూల్యాంకనం చేశామని కోర్టుకి జగన్ సర్కారు నివేదించిందని తెలిపారు. డిజిటల్ విధానంలో ఎంపికైన 326 మందిలో 124 మంది మాత్రమే మాన్యువల్ వేల్యూయేషన్‌లో ఎంపిక కావడం వెనుక మతలబు ఏంటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్ 1 ఇంటర్వ్యూ ఎంపికల్లో సర్కారు ప్రాయోజిత అక్రమాలపై గవర్నర్ దృష్టి సారించాలని లోకేశ్ కోరారు. ఈ వ్యవహారంపై నిష్పాక్షికమైన న్యాయవిచారణ జరిపించాలని.. అర్హులై ఉండి కూడా ఎంపిక కాని అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.