Alert: శంషాబాద్‌ నుంచి ఏపీ వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను ప్రభావంతో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఏపీకి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దు అయ్యాయి

By -  Knakam Karthik
Published on : 28 Oct 2025 1:34 PM IST

Telugu News, Hyderabad, Andrapradesh, CycloneMontha, 18 flights cancelled

Alert: శంషాబాద్‌ నుంచి ఏపీ వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను ప్రభావంతో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఏపీకి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దు అయ్యాయి. మొత్తం 18 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. శంషాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖ, రాజమండ్రికి విమానాలు రద్దు చేశారు. అటు విజయవాడ, విశాఖ, రాజమండ్రి నుంచి శంషాబాద్‌ వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దు అయ్యాయి. తీవ్ర తుపాను దృష్ట్యా విమాన సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు. వెల్లడించారు. కాగా ఇందులో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఇండిగో విమాన సర్వీసులు ఉన్నాయి.

మొంథా తుపాను ప్రభావంపై సీఎం సమీక్ష

ఏపీపై మొంథా తుఫాను ప్రభావంపై ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వి.అనిత, పి. నారాయణ, సీఎస్ విజయానంద్, వివిధశాఖల అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం తుఫాను తీరానికి దగ్గరగా వస్తోందని.. కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ప్రారంభమైందని అధికారులు సీఎంకు వివరించారు. కాకినాడ, మచిలీపట్నం, విశాఖ తదితర తీరప్రాంతాల్లో వర్షాలు, గాలుల తీవ్రత ఉందని అధికారులు చెప్పారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గతంలో వచ్చిన తుఫానుల నష్టాన్ని బేరీజు వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తుఫాను తీరం దాటే కాకినాడ, ఆ పరిసర ప్రాంతాలకు రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని ఆదేశాలు జారీ చేశారు. గాలులు, వర్ష తీవ్రతను ముందుగానే అంచనా వేసి అందుకు తగినట్టుగా జాగ్రత్త వహించాలని సూచనలు చేశారు. విశాఖ, ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సీఎంకు అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశామని సీఎస్ వెల్లడించారు.

Next Story