అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి 14 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో బుధ‌వారం మధ్యాహ్నం రియాక్టర్ పేలడంతో ఘోర ప్రమాదం జరిగింది

By Medi Samrat  Published on  21 Aug 2024 7:30 PM IST
అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి 14 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో బుధ‌వారం మధ్యాహ్నం రియాక్టర్ పేలడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 14 మంది మృతి చెందారు. 33 మంది గాయపడ్డారు. ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్డ్స్‌ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌లో వందలాది మంది పని చేస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ సమయంలో ఒకటిన్నర గంటలకు భారీ పేలుడు సంభవించింది. మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ అలుముకుంది. దీంతో కార్మికులు భయంతో పరుగులు పెట్టారు. భారీ శబ్దం రావడంతో ఏం జరిగిందో తెలియక సమీప గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. పేలుడు ధాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు శ్లాబ్ కూలిపోయింది.

ఫార్మా సెజ్‌లోని అగ్నిమాపక యంత్రంతో పాటు మరో పదకొండు ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి. మూడో అంతస్తులోని కార్మికులను క్రేన్ సాయంతో బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఈ పరిశ్రమలో 300 మంది కార్మికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లుగా భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మృతుల వివ‌రాలు

1. స‌న్యాసి నాయుడు, ప్లాంట్ ఏజీఎం

2. రామి రెడ్డి, ల్యాబ్ హెడ్‌

3. హారిక‌, కెమిస్ట్‌

4. పార్థ‌సార‌ధి, ప్రొడ‌క్ష‌న్ ఆప‌రేట‌ర్‌

5. చిన్నారావు, హెల్ప‌ర్‌

6. రాజ‌శేఖ‌ర్‌

7. మోహ‌న్‌, ఆప‌రేట‌ర్‌

8. గ‌ణేష్‌, ఆప‌రేట‌ర్‌

9. హెచ్‌. ప్ర‌శాంత్‌

10 ఎం. నారాయ‌ణ‌రావు.. మ‌రో న‌లుగురి వివ‌రాలు తెలియాల్సివుంది.

సీఎం దిగ్భ్రాంతి

అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

Next Story