విషాదం.. తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11మంది కరోనా రోగులు మృతి
11 Covid Patients Died In Tirupati Ruia Hospital. తిరుపతి రుయా ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొవిడ్ వార్డు ఇంటెన్సివ్
By Medi Samrat Published on 10 May 2021 11:32 PM ISTతిరుపతి రుయా ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొవిడ్ వార్డు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలిగింది. దీంతో ఆక్సిజన్ అందక 11మంది కరోనా రోగులు మృతి చెందారని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ తెలిపారు. మరి కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉందని.. వైద్యులు వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. తమిళనాడు నుండి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఐదు నిమిషాలు ఆలస్యం అవడంతో ఈ ఘటన జరిగినట్లు కలెక్టర్ తెలిపారు.
అయితే సమయానికి ఆక్సిజన్ రావడంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడగలిగామని కలెక్టర్ వెల్లడించారు. ఘటనా సమయంలో వార్డులో 140 మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఇదిలావుంటే.. ఆక్సిజన్ సరఫరా ప్రారంభించినా పరిస్థితి కుదుటపడలేదని రోగుల బంధువులు అంటున్నారు. ఆస్పత్రి వద్ద రోగుల బంధువులు ఆందోళన చేపట్టారు. ఐసీయూలోని వస్తువులను పగులగొట్టడంతో ఆస్పత్రిలోని నర్సులు బయటకు పరుగులు తీశారు. రోగుల బంధువుల ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణమంతా విషాదకరంగా మారింది.
సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
ఇక రుయా ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఘటనకు దారితీసిన కారణాలను గుర్తించి, మళ్లీ పునరావృతం కాకుండా యుద్ద ప్రాతిపదికిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఆస్పత్రి వద్దా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. అవసరమైన సాంకేతిక సంస్థల సహాయం తీసుకుని రుయా లాంటి ఘటనలు తలెత్తకుండా చూడాలని అన్నారు. ఆక్సిజన్ సేకరణ, సరఫరాలపైనే కాకుండా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ వ్యవస్థల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.