జగన్ పాలనకు నేటితో ఆర్నెళ్లు...!
By Newsmeter.Network Published on 30 Nov 2019 2:59 PM ISTముఖ్యాంశాలు
- ఒకవైపు జగన్ నిర్ణయాలు
- మరో వైపు ప్రతిపక్షాల విమర్శలు
- నేటితో జగన్ పాలనకు ఆర్నెళ్లు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో తన పాదయాత్రల పేరుతో తిరుగుతూ ప్రతి ఒక్కరిలో గుర్తిండిపోయేలా చేశాడు. 'నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ.. ఏపీ ప్రజల్లోకి వెళ్లి తిరుగులేని విజయం సాధించాడు వైఎస్ జగన్. మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నవంబర్ 30 నాటికి ఆయన పాలనకు ఆరు నెలలు పూర్తి అవుతోంది. మాట తప్పను... మడమ తిప్పను అని చెప్పుకునే జగన్... ఈ ఆరు నెలల్లోనే పాలనపరంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా సమస్యలే ధ్యేయంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించాడు. 'ఆరు నెలల నుంచి ఏడాది సమయం ఇవ్వండి.. నన్ను నేను నిరూపించుకుంటా' అని ప్రమాణస్వీకారం రోజే జగన్ ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను చూసి జనాలు జగన్‌కు ప్రహ్మరథం పట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒకవైపు ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెడుతున్నా..వాటిని ఎదుర్కొంటూ పాలన కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో పింఛన్ మూడు వేలకు పెంచుతానని హామీ ఇచ్చినా.. రూ. 250 మాత్రమే పెంచి... ఐదేళ్లలో రూ. 3 వేలకు పెంచుకుంటూ పోతానని చెప్పడంతో ప్రజల్లో కొంత నిరాశ ఎదురైంది. ఆ సమయంలో జగన్ కూడా చంద్రబాబు లాంటి నాయకుడేనని కొంత వ్యతిరేకత ఎదురైంది. వాలంటీర్ల నియామకం చేస్తానని చెప్పడంతో చాలా మంది వరకు వాలంటీర్ల కోసం దరఖాస్తు చేసుకోగా, అందులోకూడా జనాలు మోసం చేసేలా ప్లాను వేశాడేమోనని భావించారు. ఈ నియామకాల్లో ఎక్కువ విమర్శలు రాకుండా చేయడంలో జగన్ ప్రభుత్వం విజయవంతం అయ్యాడనే చెప్పాలి. అలాగే యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగు వేశాడు. గ్రామ సచివాయాల్లో యువతకు ఉద్యోగాలు కల్పించారు.
అలాగే మహిళలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో బెల్టుషాపులను తొలగించారు. రైతాంగం అయితే పది ఎకరాల వరకు మాగాణి పొలం ఉన్నా.. 25 ఎకరాల వరకు మెట్ట పొలం ఉన్నా.. రెండు కలిపి 25 ఎకరాల లోపు ఉన్న వారికి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం వర్తించేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు. ‘జగనన్న వసతి దీవెన’ కింద ఏటా రూ. 2300 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం కంటే జగన్ సర్కార్ సంవత్సరానికి రూ.1500 కోట్లు అదనంగా ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రులను అభివృద్ధి చేస్తామని సీఎం జగన్ చెప్పారు. ఇందు కోసం రూ.1500 కోట్లు కేటాయింపులు కూడా చేశారు. అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు తొలి విడతలో భాగంగా రూ. 10 వేల లోపు డిపాజిట్ చేసిన 3.70 లక్షల మందికి రూ. 263 కోట్లు వైయస్ జగన్ సర్కార్ పంపిణీ చేసింది. జనవరి 9, 2020 నుంచి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున సాయం జగన్ ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా 43 లక్షల మంది అమ్మలకు రూ.6 ,455 కోట్లు పంపిణీ చేయనున్నారు.
�
ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి:
ఆరోగ్య శ్రీ, అమ్మ ఒడి, అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు, ఆటోవాలాలకు ఆర్థిక సాయం, మత్య్సకార భరోసా, రైతు భరోసా, నాయీ బ్రాహ్మణులకు హామీలు వంటివి సీఎం జగన్ అమలు చేశారు. వీటితో పాటు మరిన్నిపథకాలను ప్రవేశపెట్టారు. జగన్ పాలన సవ్యంగా కొనసాగుతున్న తరుణంలో ప్రతిపక్షాల నుంచి కొంత వ్యతిరేకత ఎదురైంది. అదేంటంటే... ఇసుక కొరత ఏర్పడటం. ఇది జగన్ ప్రభుత్వానికి విపక్షాల నుంచి ఎదురైన మొదటి పెద్ద సమస్య. దీని నుంచి బయటపడేందుకు జగన్ సర్కార్ చాలా వరకు శ్రమించింది. అలాగే ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై వచ్చిన విమర్శలను వైసీపీ ప్రభుత్వం తనదైన శైలిలో సమర్థవంతంగా తిప్పికొట్టింది.
గతంలో చంద్రబాబు చేసిన తప్పులు తాను కూడా చేయకుండా ఉండాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అమరావతి విషయంలో ప్రభుత్వ వైఖరి స్పష్టం లేకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందిగా మారిందనే చెప్పాలి. భవిష్యత్తుల్లో కేంద్రం నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకునేందుకు తనదైన శైలిలో అడుగులు వేస్తోంది జగన్ సర్కార్.
పార్టీ పరంగా విమర్శలు :
జగన్ సర్కార్‌కు ఏర్పడి ఆరునెలలు అయినప్పటికీ జనాల్లో మంచి మార్కులే పడ్డాయి. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వచ్చారు జగన్. అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో గుర్తుండిపోయేలా పథకాలు తీసుకొచ్చారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, సమస్యలు పరిష్కరించడమే తన పాలన కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. పాలన పరంగా జనాల్లో మంచి ఆదరణ ఉన్నా.. పార్టీని పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. పార్టీకి ప్రభుత్వానికి అంతగా సమన్వయం లేదనే భావన వైసీపీ శ్రేణుల్లోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జగన్ ఆరు నెలల పాలనలో ప్రతిపక్షాలు కూడా ఎదురుతిరిగాయి. ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్నారని చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల విమర్శలను ఏ మాత్రం పట్టించుకోకుండా జగన్ తన పాలనపై దృష్టి సారించారు.
ఒక వైపు జగన్ పాలన విషయంలో టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించగా, అందుకు వారి విమర్శలను కూడా వైసీపీ నేతలు తిప్పికొట్టారు. చంద్రబాబు పాలనలో జరిగిన అన్యాయాలపై లేవనెత్తారు. చంద్రబాబు పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఆరోపించారు. అలాగే రాజధాని నిర్మాణ విషయంలో భూములిచ్చిన రైతులకు చంద్రబాబు అన్యాయం చేశాడని ఆరోపించారు. జగన్ ఆరు నెలల పాలనపై ఇన్ని ఆరోపణలు చేస్తుంటే , మరీ చంద్రబాబు ఐదేళ్లపాలనలో ఏం ఒరగబెట్టారని ఆరోపించారు వైసీపీ నేతలు.
ప్రతిపకాల విమర్శలు:
జగన్ గారి బాధ్యతారాహిత్యం, మంత్రుల చేతకానితనం మూలంగా వైసీపీ పాలనలో గత 6 నెలలుగా రైతులు నానాయాతన అవస్థలు పడుతున్నారని, విత్తన సరఫరా నుంచి గిట్టుబాటు ధర అందించడం వరకు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయిందని ఆరోపణలు గుప్పించింది. వైసీపీ ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం టీడీపీ హయాంలో రూ.5లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలు సాకారమయ్యాయని, కానీ వైసీపీ 6 నెలల పాలనలో రూ.1,80,000 కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగాలకు మాత్రమే పరిమితమైందని దుయ్యబట్టింది.
�