చలిలో వేడి పుట్టించనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు..!

By అంజి  Published on  30 Nov 2019 7:58 AM GMT
చలిలో వేడి పుట్టించనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు..!

అంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చలికే వేడి పుట్టించబోతున్నాయి. డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో పేల్చేందుకు మాటల తూటాలు, దూసేందుకు పదునైన ఆరోపణల కత్తులు సిద్ధమౌతున్నాయి. ప్రభుత్వ పక్షం, విపక్షం “రెఢీ” అంటున్నాయి.

అధికార వైకాపా టీడీపీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, అచ్చెన్నాయుడుల పై సభాహక్కుల భంగం నోటీసులు ఇచ్చాయి. స్పీకర్ తమ్మినేని సీతారామ్ ను దూషించిన కారణంగా వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. దీంతో హళ్లికి హళ్లి సున్నకు సున్న అన్నట్టు తెలుగుదేశం కూడా తమ నేత చంద్రబాబుపై అవాకులు చెవాకులు పేలారంటూ వైకాపా సభ్యులపై సభా హక్కుల నోటీసునిచ్చాయి. ఆయనను అనరాని మాటలన్నారని ఈ నోటీసులో పేర్కొన్నారు. త్వరలో తెదెపా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సమావేశమై , ఈ విషయం పై చర్చిస్తుంది. మంత్రులు సైతం వర్ణించ వీలుకాని భాషలో చంద్రబాబును తిట్టారని వారంటున్నారు. వైకాపా తమతో మైండ్ గేమ్స్ ఆడుతోందని, తాము కూడా అందుకు విరుగుడుగా వ్యూహాలను సిద్ధం చేస్తున్నామని వారు చెబుతున్నారు.

అసెంబ్లీలో కేవలం 23 మందే సభ్యులున్నా , తాము దీటుగా పోరాడతామని తెదేపా అంటే, చంద్రబాబు దీక్షలకే చాలా మంది తెదెపా ఎమ్మెల్యేలు హాజరుకాలేదని, ఇది ఆయన పతనానికి, పార్టీ నుంచి వలసలకి నాంది వంటిది మాత్రమేనని వైకాపా వెక్కిరిస్తోంది. మొత్తం మీద లడాయికి ఇరు పార్టీలు బడాయిగా సిద్ధమౌతున్నాయి.

Next Story