ఆ నాలుగు జిల్లాల్లో లక్షణాలు లేకపోయినా పాజిటివ్‌ కేసులు

By సుభాష్  Published on  24 Aug 2020 8:43 AM IST
ఆ నాలుగు జిల్లాల్లో లక్షణాలు లేకపోయినా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మాత్రం కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. కరోనా పాజిటివ్‌లు రావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా ముఖ్య లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు, గొంతులో నొప్పి తదితర లక్షణాలు లేకుండానో కరోనా నిర్ధారణ అవుతోంది. దీనికి సంబంధించి సీరో సర్వైలెన్స్‌ సర్వేలో పలు సంచలన నిజాలు వెలుగు చూశాయి.

తూర్పుగోదావరి, కృష్ణా, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో సర్వైలెన్స్‌ సర్వేను వైద్యఆరోగ్య శాఖ చేప‌ట్టింది. ఈ జిల్లాల్లో నమోదైన కేసుల్లో ఎలాంటి కరోనా లక్షణాలు లేకుండానే పాజిటివ్‌ నిర్ధారణ అవుతోంది. అనంతపురం జిల్లాల్లో 99.5, కృష్ణా జిల్లాల్లో 99.4, నెల్లూరు జిల్లాల్లో 96.1, తూర్పుగోదావరి జిల్లాల్లో 92.8 శాతం మందికి ఎటువంటి వైరస్‌ లక్షణాలు లేకుండానే పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఎక్కువగా జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో నిర్వహించిన సరర్వేలో 22.3 శాతం మందికి కరోనా వచ్చివెళ్లినట్లు కూడా తెలియదు. ఆ 22.3శాతం మందిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో ఎలాంటి లక్షోణాలు లేకుండా కరోనా సోకిన వారిని పది రోజుల పాటు హోంక్వారంటైన్‌, ఐసోలేషన్‌లో ఉంచుతున్నారు. పది రోజుల్లో వ్యాధి తీవ్రత పెరిగి, జ్వరంగానీ, దగ్గుగానీ, గొంతునొప్పి లాంటివి వస్తే వాటికి మందులు ఇస్తారు. లేదంటే సరైన పోషకాహారం తీసుకుంటే సరిపోతుంది. 11వ రోజు నుంచి వారు తగ్గు జాగ్రత్తలు తీసుకుని బయట వెళ్లాల్సి ఉంటుంది. ఇక వారికి వైరస్‌ సోకే అవకాశం ఉండదు. అంతేకాదు మళ్లీ కరోనా పరీక్షలు అవసరం ఉండదు. ఇలాంటి వారు ఎక్కువ మంది హోం క్వారంటైన్‌లో ఉంటారని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ స్పెషల్‌ ఆఫీసరర్‌ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

Next Story