నా మీద వస్తున్న ఆరోపణలు ఎంతో బాధపెడుతున్నాయి : యాంకర్ ప్రదీప్
By తోట వంశీ కుమార్ Published on 27 Aug 2020 1:02 PM GMTఇటీవల మిర్యాలగూడకు చెందిన ఓ యువతి తనపై 139 మంది ఆత్యాచారం చేశారని పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను సీసీఎస్ పోలీసులు వేగవంతం చేశారు. ఎఫ్ఐఆర్, బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా నిందితులను విచారించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 139 మంది నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. ఇప్పటికే 42 పేజీలతో ఎఫ్‌ఐఆర్ రెడీ చేశారు. ప్రముఖ రాజకీయ నాయకుల పీఏలు, టీవీ నటులు, పోలీసులు, ఎస్‌ఎఫ్‌ఐ లీడర్లు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది.
కాగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా ఉన్నాడంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రదీప్ వివరణ ఇచ్చారు. కొందరు వ్యక్తులు కావాలనే తనను టార్గెట్‌గా చేసుకుని తనకు ఎలాంటి సంబంధంలేని వివాదంలోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘సోషల్ మీడియాలో నా మీద వస్తున్న ఆరోపణలు ఎంతో బాధపెడుతున్నాయి. సున్నితమైన వివాదంలో నా పేరు పెట్టి ఉద్దేశపూర్వకంగానే అటాక్ చేస్తున్నారు. అవతలి వ్యక్తులు నా పేరు ఎందుకు పెట్టారో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. వాళ్లు అనుకున్నదే నిజమని రాస్తూ.. నా ఫోటోలు వాడుతూ.. నా పేరు మీద హెడ్డింగులు పెడుతూ వికృత కథనాలు వెలువరిస్తున్నారు. సోషల్ మీడియాలో నాపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తాను. ఒక వ్యక్తికి న్యాయం జరగడం కోసం ఇంకో వ్యక్తి జీవితాన్ని నాశనం చేసేస్తారా..? వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్లు రాస్తారా..? నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది. అప్పటి వరకు ఆగలేరా..?
ఒక్కో మెట్టు ఎదిగిన నన్ను కావాలని వివాదంలోకి లాగుతున్నారు. సోషల్ నెట్ వర్క్ లో నా పేరు వాడటం చాలామందికి అలవాటుగా మారింది. అనవసరమైన ఆరోపణలతో నా సన్నిహతులు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నిజనిజాలు ఖచ్చితంగా బయటకు రావాలి’ అని వీడియో ద్వారా వెల్లడించారు.