చిన్న దేవరకొండతో పెద్ద నిర్మాత
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 July 2020 11:29 AM ISTవిజయ్ దేవరకొండ ఇలా స్టార్ అయ్యాడో లేదో.. అతడి ఇంటి నుంచి కూడా మరో హీరో బయల్దేరాడు. అతనే ఆనంద్ దేవరకొండ. విజయ్ సినిమాల్లోకి వచ్చి తంటాలు పడుతున్నపుడు ఫారిన్లో ఉద్యోగం చేసుకుంటున్న అతను.. అన్నకు స్టార్ ఇమేజ్ రాగానే ఇండియాలో వచ్చి వాలిపోయాడు. నేను కూడా సినిమాల్లోకి వస్తా అని రెడీ అయిపోయాడు. అది విజయ్‌కి నచ్చకపోయినా.. చివరికి అతడికి సపోర్ట్ చేయక తప్పలేదు.
కానీ ఆనంద్ తొలి సినిమా ‘దొరసాని’ బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్నందుకుంది. నటన పర్వాలేదనిపించినా.. లుక్స్ విషయంలో చాలా విమర్శలే ఎదుర్కొన్నాడు ఆనంద్. అప్పటి ఆ ఫీడ్ బ్యాక్ చూస్తే ఆనంద్ ఇంకో సినిమా చేయకూడదు. కానీ విజయ్ బ్యాకప్‌తో అతడికి అవకాశాలకేమీ లోటు లేదని తెలుస్తోంది.
టాలీవుడ్ పెద్ద నిర్మాతల్లో ఒకరైన ఆనంద్ ప్రసాద్.. ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. వినోద్ అనంతోజు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ‘బిగిల్’ సినిమాలో క్యారెక్టర్ రోల్ చేయడంతో పాటు తెలుగులో ‘జాను’, ‘చూసీ చూడంగానే’ సినిమాల్లో నటించిన వర్ష బొల్లమ్మ ఈ చిత్రంలో కథానాయికగా నటించనుంది. స్వీకర్ అగస్తీ సంగీతం సమకూర్చనున్నాడు. షూటింగ్స్ పున:ప్రారంభం అయ్యాక ఈ చిత్రం పట్టాలెక్కుతుంది.
దీంతో పాటు దామోదర అత్తాడ అనే కొత్త దర్శకుడితోనూ ఆనంద్ ఓ సినిమా చేయనున్నాడు. ఆనంద్ హీరోగా మరో సినిమా కూడా లైన్లో ఉంది. మొత్తానికి విజయ్ అండతో ఆనంద్‌కు అవకాశాలైతే లోటు లేనట్లే ఉంది. అన్నీ బాగుంటే వచ్చే ఏడాది చివరిలోపు ఆనంద్ మూడు సినిమాలు పూర్తి చేసేలా ఉన్నాడు.