Fact Check : క్యాన్సర్ చికిత్స కోసం అమిత్ షా న్యూయార్క్ కు వెళ్ళారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు
కొద్దిరోజుల కిందట కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి ఎయిమ్స్‌లో చేరి డిశ్చార్జ్ అయ్యారు. అంతకు ముందు ఆగస్టు 2న అమిత్ షాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా చికిత్స కోసం గురుగావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స అనంతరం కోలుకున్న ఆయనకు ఆగస్టు 14 నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముందు మరోసారి ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకున్నారు.
ఇలాంటి సమయంలో సామాజిక మాధ్యమాల్లో యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షాకు సంబంధించిన వదంతులు వైరల్ అవుతూ ఉన్నాయి. అమిత్ షా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం న్యూయార్క్ కు వెళ్లారంటూ పలు పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి.
“Amit Shah suffers AVIAN SARCOMA flown to New York in Air Ambulance. Condition critical,” అంటూ ట్విట్టర్ లో పోస్టులు పెడుతూ వస్తున్నారు.
ఈ వార్తపై నిజానిజాలు తెలియజేయాలంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో కోరుతూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు.
అమిత్ షాకు సంబంధించిన విషయాలపై న్యూస్ మీటర్ సెర్చ్ చేయగా.. ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలను, ఆయన విభాగాలను దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు అమిత్ షా.
తాను ఏయే రోజు.. ఏయే కార్యక్రమాలకు హాజరయ్యానో కూడా అమిత్ షా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు తెలియజేస్తూ వస్తున్నారు. గాంధీనగర్ లోక్ సభ పరిధిలో 200 కుటుంబాలకు ఆయన ఎలెక్ట్రిక్ కుక్కర్లను అందజేశారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు.
హోమ్ మినిస్ట్రీ అకౌంట్ లో కూడా ఈ పోస్టును అప్లోడ్ చేశారు.
कल सुबह 11 बजे वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से केंद्रीय गृह मंत्री श्री @amitshah गांधीनगर में 20 गांवों के 200 कुम्हारों को विद्युत चालित चाक वितरित करेंगे। pic.twitter.com/mYaMs61o0C
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) September 29, 2020
ANI వార్తా సంస్థ కథనం ప్రకారం ఆయన బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిశారు. 2020లో నిర్వహించనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చించారు. అమిత్ షాతో బీహార్ ఎలక్షన్ ఇన్-ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్, భూపేంద్ర యాదవ్ భేటీ అయ్యారు.
క్యాన్సర్ చికిత్స కోసం అమిత్ షా న్యూయార్క్ కు వెళ్ళారన్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.