ఎవ్వరూ ఆక్రమించలేదు.. ఎందుకు చనిపోయారు..? రాజకీయాలొద్దు..
By తోట వంశీ కుమార్ Published on 20 Jun 2020 1:44 PM ISTగల్వాన్ లోయలో చైనా దురాగతానికి మన సైనికులు 20 మంది అమరులైన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై మోదీ అధ్యక్షతన శుక్రవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి కేంద్రానికి సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మన భూభాగంలోకి చైనా చొరబడలేదనీ.. కన్నెత్తి చూసేందుకు యత్నించిన వారికి మన సైనికులు గుణపాఠం నేర్పారని అన్నారు. మన సైన్యం పూర్తి శక్తి సామార్థ్యాలతో పని చేస్తోందని, దేశ రక్షణ పట్ల ఎవరికీ అనుమానం అక్కర్లేదని భరోసా ఇచ్చారు.
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చైనా దురాక్రమణకు తలొగ్గి ప్రధాని భారత భూభాగాన్ని వారికి అప్పగించారు అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకవేళ ఆ భూభాగం చెనాది అయితే.. మన సైనికులెందుకు చనిపోయారు..? వారంతా ఎక్కడ మృతి చెందారు..? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిషా స్పందించారు. రాహుల్ గాంధీ రాజకీయాలు చేయడం మానేసి సైనికులకు సంఘీభావం తెలపాలంటూ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ రాజకీయాలు చేయడం సరికాదంటూ ఓ సైనికుడి తండ్రి మాట్లాడిన వీడియోను అమిత్ షా ట్వీట్ చేశారు. "ఓ ధీశాలి అయిన ఆర్మీ మ్యాన్ తండ్రి రాహుల్ గాంధీకి చాలా స్పష్టమైన సమాధానాన్ని ఇచ్చారు. దేశమంతా ఏకతాటిపై ఉన్న వేళ, రాహుల్ గాంధీ కూడా తుచ్ఛమైన రాజకీయాలు పక్కనబెట్టి, జాతి ప్రయోజనాల కోసం నిలబడాలి" అని ఆయన ట్వీట్ చేశారు.
ఆ జవాన్ తండ్రి ఏం మాట్లాడంటే.. మన సైన్యం చైనాను ఓడించగలదు. రాహుల్‌గాంధీ ఈ విషయంలో రాజకీయాలు చేయకండి. నా కొడుకు సైన్యంలో ఉండి పోరాడాడు.. ఇంకా పొరాటాన్ని కొనసాగిస్తున్నాడూ అంటూ మాట్లాడాడు.