అంబేద్కర్ ఇంటిని ధ్వంసం చేశారు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 July 2020 9:09 AM GMT
అంబేద్కర్ ఇంటిని ధ్వంసం చేశారు..!

ముంబై: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గృహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మంగళవారం సాయంత్రం దాదర్‌లో ఉన్న ఇళ్లు ‘రాజగృహ’ లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు వరండాను, పూల కుండీలను ధ్వంసం చేశారు. వారిపై పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశామని బుధవారం నాడు పోలీసు అధికారి తెలిపారు.

ఇద్దరు వ్యక్తులు గ్లాస్ కిటికీలపై రాళ్లతో విసిరారని, సీసీటీవీలను ధ్వంసం చేయడమే కాకుండా వరండాను, పూల కుండీలను ధ్వంసం చేశారని పోలీసు అధికారి తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తి పూలకుండీని పగులగొట్టడం.. ఆ తర్వాత అక్కడి నుండి పారిపోవడం జరగడం గమనించవచ్చు. మాతుంగా పోలీసు స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్. ను రిజిస్టర్ చేశారు.

దాదర్ లోని హిందూ కాలనీలో ఈ బంగళా ఉంది. రాజగృహలో బీఆర్‌ అంబేద్కర్‌ తాను సేకరించిన పుస్తకాలను, సాహిత్యాన్ని పెద్దసంఖ్యలో నిల్వచేసేవారు. ప్రస్తుతం ఆ ఇంటిని అంబేద్కర్‌ వాడిన కొన్ని వ్యక్తిగత వస్తువులను ప్రదర్శించే మ్యూజియంగా మార్చారు. రాజగృహలో బాబాసాహెబ్ కోడలు ఉంటోంది. ఆయన మనవళ్లు ప్రకాష్ అంబేద్కర్, ఆనంద్ రావ్, భీమ్ రావ్ లు ఉంటున్నారు. ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో ప్రకాష్ అంబేద్కర్ అకోలాలో ఉన్నారు. ఈ ఘటన పట్ల అంబేద్కర్ అభిమానులు ప్రశాంతంగా ఉండాలని.. ఇంటి ముందు గూమికూడవద్దు అని కోరారు.

ఈ దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ను కోరారు. ఈ ఘటనను మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఖండించారు. ఈ సంఘటనపై తక్షణమే దర్యాపు చేయాలని పోలీసులను ఆదేశించామని, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ట్వీట్‌ చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Next Story
Share it