ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ దూకుడు.. నాలుగు స్పెషల్ టీమ్స్
By అంజి
రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, బెల్లంకొండ నరసింహాలపై కేసు నమోదు చేశామని సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. మభ్యపెట్టి తన భూమి కొనుగోలు చేశారని వెంకటాయపాలెంకు చెందిన మహిళ పోతురాజు బుజ్జి ఫిర్యాదు చేసిందని ప్రశాంతి తెలిపారు. 99 సెంట్ల భూమి కొనుగోలు చేసినట్లు తమ విచారణలో వెల్లడైందని సీఐడీ ఎస్పీ ప్రశాంతి తెలిపారు. 420, 506, 120B, ఐపీసీ సెక్షన్ 3 కింద కేసు నమోదు చేశామన్నారు.
అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 797 తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ భూములు కొన్నట్లు అధికారులు నిర్దారించారు. రూ.3 కోట్లకు చొప్పున ఎకరం భూమి తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ కొనుగోలు చేసినట్లుగా గుర్తించామని సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి అన్నారు. రూ.220 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. తెల్లరేషన్ కార్డు హోల్డర్స్‌తో కొనుగోలు చేయించిన వారి వివరాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
అమరావతిలో 129 ఎకరాలు 131 మంది తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ కొనుగోలు చేశారని ఎస్పీ మేరి ప్రశాంతి తెలిపారు. పెద్దకాకానిలో 40 ఎకరాలు 43 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్, తాడికొండలో 190 ఎకరాలు 188 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ రిజిస్టర్ చేసుకున్నారన్నారు. తుళ్లూరులో 242 ఎకరాలు 238 మంది, మంగళగిరిలో 133 ఎకరాలు 148 మంది, తాడేపల్లిలో 24 ఎకరాలు 49 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ కొనుగోలు చేసినట్లు తమ విచారణలో వెల్లడైందని సీఐడీ ఎస్పీ మేరి ప్రశాంతి తెలిపారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సీఐడీ వేగంగా పావులు కదుపుతోంది. బుధవారం రోజున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఆరోపణలపై నాయకులపై విచారణ చేయడానికి హోంశాఖ మంత్రి సుచరిత అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులను పట్టుకుంటుందని అమె తెలిపారు.