అమరావతి పరిసర ప్రాంతాల్లో పూర్తిగా బంద్‌ వాతావరణం నెలకొంది. నిన్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన రైతులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. మహిళలు, యువకులు, పిల్లలను అని చూడకుండా లాఠీలు ఝులిపించారు. చేతికి అందినవారిని చితకబాదారు. పోలీసుల లాఠీ దెబ్బలను తట్టుకోలేకపోయిన రైతులు ఒక దశలో పోలీసులపై తిరగబడ్డారు. రాళ్లు రువ్వారు. దీంతో అమరావతిలో పరిస్థితులు యుద్ధంలో రణరంగాన్ని తలపించాయి.

ఇందుకు నిరసనగా అమరావతి పరిరక్షణ సమితి రాజధాని గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా తమ షాపులను మూసివేశారు. పోలీసులకు ఎటువంటి సహాయం చేయరాదని నిర్ణయించారు. తాగే మంచి నీరు నుంచి ఏ వస్తువులను ఇవ్వకూడదని షాపుల యాజమానులు నిర్ణయించుకున్నారు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని, అది అమరావతికి మాత్రమే సాధ్యమని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ జెండాలతో నిరసనలు తెలపాలని రాజధాని రైతులు నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు చేపడుతున్నాయి. రాజధాని రైతులు ఆందోళనలు ఇప్పటికే 35వ రోజుకు చేరుకున్నాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు ధర్నాలు, మహా ధర్నాలు చేస్తున్నారు.

మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ మందడంలో రైతులు నిరసన చేపట్టారు. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని రైతులు అంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు సీఆర్డీఏకి రైతులు తమ అభిప్రాయాలు తెలిపే అవకాశం కోర్టు ఇచ్చిందని.. అయితే అందుకు విరుద్ధంగా రాష్ట్ర కేబినెట్‌ వికేంద్రీకరణ బిల్లును ఎలా ఆమోదిస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం త్వరలోనే తగిన భారీ మూల్యం చెల్లించుకుంటుందని, దీనిపై న్యాయపోరాటం చేస్తాని రైతులు స్పష్టం చేశారు. రైతుల నిరసనల నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. సచివాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎంపీ గల్లా జయదేవ్‌ను పోలీసుల అరెస్ట్‌ చేశారు. రైతులతో కలిసి అక్రమంగా అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నం చేసినందుకు తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌ ఆయనపై కేసు నమోదైంది. రైతులతో కలిసి గల్లా జయదేవ్‌ అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అతని అడ్డుకున్న పోలీసులు మొదటగా నరసరావుపేట పీఎస్‌కు తరలించి అక్కడి నుంచి రొంపిచర్ల పీఎస్‌కు తరలించారు. 143, 332, 188, 353, 323, 324 సెక్షన్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.