అమరావతిలో కీచక ఎస్సై..
By తోట వంశీ కుమార్ Published on 10 Jun 2020 4:47 PM IST
బాధ్యతగా ఉండాల్సిన ఓ పోలీస్ దారి తప్పాడు. న్యాయం చేయాల్సింది పోయి ఓ మహిళ వద్ద డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన అమరావతిలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. పెదకూరపాడు మండలానికి చెందిన ఓ జంట అమరావతిలోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో ఓ రూమ్‌ను అద్దెకు తీసుకున్నారు. ఇది గమనించిన ఎస్సై రామాంజనేయులు తన డ్రైవర్ తో కలిసి అక్కడు చేరుకున్నాడు. వారిద్దరిని బెదిరించి రూ.10వేలు డిమాండ్ చేశారు. లేదంటే ఇద్దరిని స్టేషన్‌కు తీసుకెళ్లి వ్యభిచారం కేసు నమోదు చేస్తానని బెదిరించాడు. తమ వద్ద అంత నగదు లేదని, రూ.5వేలు ఇస్తామని బతిమిలాడుకున్నారు.
రూ.3వేలు ఇచ్చిన ఆ యువకుడు మిగతా డబ్బు కోసం ఏటీఎంకు వెళ్లాడు. ఆయువకుడితో పాటు డ్రైవర్ సాయికృష్ణను కూడా వెంట పంపించాడు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. దీంతో ఆయువతి ఎస్‌ఐతో వాగ్యాదానికి దిగింది. ఇంతలో ఆ యువకుడు అక్కడకు వచ్చి మిగిలిన రూ.2వేలను ఇచ్చాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. ఆ జంట వివరాలు తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
జరిగిన ఘటనపై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్‌ఐ రామాంజనేయులు, డ్రైవర్ సాయికృష్ణను సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబందించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు తెలిపారు.